ఐకమత్యమే భారతీయుల బలం
ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలి
- భారత్ కి బాసటగా ప్రపంచ దేశాలు నిలుస్తున్నాయి
- ఐకమత్యమే భారతీయుల బలం
విశాఖపట్నం మే 11:
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారా ప్రపంచశాంతి సాధ్యపడుతుందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం– దేశ సమైక్యతను పెంపొందిద్దాం– మేరా భారత్ మహాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి సంఘీభావం లభిస్తోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కలసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశాల అభివృద్ధికి అవరోధంగా తీవ్రవాదం నిలుస్తోందని చెప్పారు.
ప్రజలందరి ఐక్యత మన దేశానికి వెలకట్టలేని సంపదగా నిలుస్తోందని అన్నారు. ఐకమత్యమే భారతీయుల బలమని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి విచారకరమని ఈ దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్ భారతదేశ సాంకేతికపటిమను, రక్షణ రంగంలో మన సత్తాను చాటిందని అన్నారు. ప్రజలంతా దేశ భద్రతకు, అభివృద్ధికి, పటిష్టతకు పాటుపడాలని సూచించారు.
విద్య విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు మాట్లాడుతూ భారతదేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని అదే సమయంలో తమ దేశ ప్రజలకు ముప్పు తలపెట్టేవారిని ఎంత మాత్రం ఉపేక్షించరని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ నిలుస్తుందని చెప్పారు. దేశ భద్రత కోసం సరిహద్దులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న త్రివిధ దళాల సిబ్బందికి భారతీయులంతా బాసటగా నిలవాలని కోరారు. వారి సేవలను, ధైర్యాన్ని యువతరం స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పాటుపడాలని సూచించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పిస్తున్న వీర జవాన్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు భారతీయులంతా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటీవల మృతి చెందిన తెలుగు జవాను మురళి నాయక్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం త్రివర్ణ పథకాలను పట్టుకుని భారత్ మాతాకీ జై... మేరా భారత్ మహాన్.... అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో విద్యా విభాగం అధ్యాపకులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య సూర్య ప్రకాష్ ను సత్కరించారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి