ఏయూ సిఈ పూర్వవిద్యార్థుల సమావేశం 7న
ఏయూ సిఈ పూర్వవిద్యార్థుల సమావేశం 7న
- రూ 4.5 కోట్లతో హాస్టల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు
ఆంధ్రవిశ్వవిద్యాలయం, డిసెంబర్ 5 :
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని 7 వ తేదీన వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్షులు ఐ.వి.ఎన్.ఎస్.కె విశ్వనాథ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరవుతారు.
ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా పట్టభద్రులైన పూర్వ విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వవిద్యార్థులు తమ ప్రయాణాన్ని, ప్రగతిని, అనుభవాలను, అనుభూతులను ఈ సందస్భంగా పంచుకుంటారు. అదే విధంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, వారి తల్లిదండ్రులకు ఆత్మీయ సత్కారం చేస్తామన్నారు.
సర్ ఎం.విశ్వేస్వరయ్య హాస్టల్ భవనాన్ని రూ 3.5 కోట్ల వ్యయంతో సంఘం సభ్యులు స్వయంగా నిర్మించి వర్సిటీకి బహూకరించడం జరిగిందని, తాజాగా మరొక రూ 1.2 కోట్లతో అదనపు అంతస్థు నిర్మిస్తున్నామన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు అందించిన విరాళాలతో ఈ హాస్టల్ నిర్మాణం జరిపినట్లు తెలిపారు.
విశాఖ నగరం పరిసర ప్రాంతాలలో ఉన్న పూర్వవిద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జరిగే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరు కావాలని పూర్వవిద్యార్థుల సంఘం తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంగా ఈ సమావేశం ఒక మధుర అనుభూతిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.
కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్కర రావు, ఉపాధ్యక్షులు ఎం.జి మాధవ బాబు, సీనియర్ సభ్యులు వి.ఆర్ రావు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి