బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్
ఔట్‌సోర్సింగ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ పై పరిశోధనకు
బొటుకు రమేష్ బాబుకు డాక్టరేట్
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లాకళాశాలలో పిహెచ్‌డివిద్యార్థి అయినబొటుకు రమేష్ బాబుకు "ఔట్‌సోర్సింగ్ ఉపాధి: భారత రాజ్యాంగం మరియు పారిశ్రామిక న్యాయ శాస్త్రానికి విరుద్ధం" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది. పరిశోధనకు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.విజయ లక్ష్మి గారు గైడ్ మరియు రీసెర్చ్ డైరెక్టర్ గా మార్గనిర్దేశం చేశారు. వీరి పరిశోధన ప్రభుత్వ రంగ మరియు ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలలోని కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్స్డ్ ఉద్యోగుల స్థితిగతులపై దృష్టి సారించింది, అనుభవపూర్వక అధ్యయనం ద్వారా ఈ ఉద్యోగులు తరచుగా యజమానులచే తీవ్రంగా దోపిడీ చేయబడుతున్నారని, చట్టబద్ధమైన ప్రయోజనాలు మరియు సామాజిక రక్షణను పొందలేకపోతున్నారని గుర్తించింది. అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై నియామకం ఉద్యోగుల మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలకు హానికరమని, వారి జీవించే హక్కు మరియు గౌరవాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ తరచుగా ఒక మోసపూరితమైనదని, కార్మికులను దోపిడీ చేస్తుందని మరియు వారికి సరైనప్రయోజనాలను నిరాకరిస్తుందని న్యాయవ్యవస్థ ఎత్తి చూపిందని అధ్యయనం వెల్లడించింది. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయడానికి,కనీస వేతనాలు, సకాలంలో వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, ఆరోగ్యం, వైకల్యం మరియు వృద్ధాప్యకాలంలో రక్షణను పరిరక్షించే చట్టాలు ఉన్నప్పటికీ, ఎంతోమంది ఉద్యోగులకు ఈ నిబంధనలు అందుబాటులో లేవని అధ్యయనం పేర్కొంది. ఈ ఉద్యోగులు సమాన అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, ఒకే విధమైన పనిచేస్తున్నప్పటికీ జీతాలలోను మరియు సౌకర్యాలలోను రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చినపుడు ఎంతో వివక్షకు గురవుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధనా సంస్థలలో రెగ్యులర్లు ఉద్యోగులకు అందిస్తున్న సంస్థాగత డిస్పెన్సరీ, ఉచిత రవాణా సౌకర్యాలు, రిస్క్ అలవెన్స్‌కు వీరికి అర్హత లేదు.మహిళా కార్మికులను వారి ప్రసూతి కాలంలో తొలగించే సందర్భాలు ఉన్నాయి. ఈ విధానం ద్వారా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలిగిన ఎస్ సి, ఎస్ టీ, బీసీ, వికలాంగులు, మహిళలు అవకాశాలు కోల్పోతున్నారని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన హక్కులు నిర్వీర్యమయ్యే పరిస్థితి వారి పురోగతికి అవరోధం వాటిల్లే ప్రమాదముందని ఉందని అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా చట్టబద్దంగా ఏర్పడిన పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వ్యవస్థల ద్వారా నియామకాలు తక్కువ అయ్యాయని, అవి ప్రాధాన్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధ్యయనం పేర్కొంది. అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ రాజ్యాంగం మరియు కాంట్రాక్ట్ లేబర్ (నియంత్రణ మరియు రద్దు) (CLRA చట్టం) నిబంధనలకు విరుద్ధమని పరిశోధన తేల్చింది. కార్మికులపై దాని ప్రతికూల ప్రభావం మరియు రాజ్యాంగ మరియు చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన దృష్ట్యా, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని పరిశోధన సూచించింది. తాత్కాలిక ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన చట్టబద్ధమైన విధానాలు మరియు నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని అధ్యయనం సూచించింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి