ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్
ప్రాణాలను రక్షించే విద్య సిపిఆర్
ఏయూ హెల్త్ సెంటర్లో సిపిఆర్ శిక్షణ కార్యక్రమం
అత్యవసర సమయంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్లో సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జెడిఎస్ హాస్పిటల్తో సంయుక్తంగా నిర్వహించిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని రక్షించే సాధనంగా సిపిఆర్ నిలుస్తుందని చెప్పారు.
ప్రతి విద్యార్థి ఇటువంటి అంశాలలో తగిన తర్ఫీదు అవగాహన పొందాలని సూచించారు. తద్వారా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులను వారి ప్రాణాలను రక్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో యువత సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవడం, స్వయంగా చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను రక్షించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వర్సటీలో పెద్దెత్తున విద్యార్థులకు సిపిఆర్ పై శిక్షణ అందిస్తున్నామన్నారు. దీనిలో కొందరిని మాస్టర్ ట్రైనర్స్గా తయారు చేసే ఆలోచన కూడా ఉందన్నారు.
జెడిఎస్ ఆసుపత్రి ఎనస్థీషియా వైద్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస రావు మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన సమయంలో సత్వరం స్పందించడం, సిపిఆర్ చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత దీనిలో శిక్షణ పొందడం ఎంతో అవసరమన్నారు.
జెడిఎస్ ఆసుపత్రి ఎముకల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. తద్వారా ఆపద సమయంలో ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించడం సాధ్యపడుతుందన్నారు. ప్రజలో వస్తృత అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం ఎంతో ప్రధానమన్నారు.
కార్యక్రమంలో ఏయూ వైద్యాధికారి డాక్టర్ జి.ఏ.వి రామేశ్వర్, జెడిఎస్ వైద్యులు డాక్టర్ షేక్ హాజీ మస్తాన్, జెడిఎస్ హాస్పిటల్ ఎం.డి పీటర్సన్ లూక్, సెయింట్ లూక్స్ గ్రూప్ విద్యసంస్థల సంయుక్త కార్యదర్శి ఎం.ఆశీర్వాద్ లూక్, ప్రీతం లూక్, ఏయూ వైద్యులు డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తి, డాక్టర్ బాలకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఆర్ శిక్షణపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. విభాగాల వారీగా విద్యార్థులకు సిపిఆర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి