జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ 16 నుంచి 19 వరకు షాపింగ్ ఫెస్టివల్
జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ 16 నుంచి 19 వరకు షాపింగ్ ఫెస్టివల్
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు
స్వయం సహాయక సంఘాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ సంస్థల ఆధ్వర్యంలో 60 స్టాళ్లు
వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం, అక్టోబర్ 14 ః జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ తదితర చిన్న, పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి రోజూ ఉదయం 10.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా జీఎస్టీపై అవగాహన శిబిరం ఉంటుందని, అలాగే ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 16వ తేదీ నుంచి ఏయూలో నిర్వహించబోయే షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ, ఇతర అంశాల గురించి జీఎస్టీ, టూరిజం అధికారులతో కలసి ఆయన మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు.
సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దీపావళి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించామని, దానిలో భాగంగా ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, తాగునీరు, టాయిలెట్ల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమ సజావు నిర్వహణ కొరకు అధికారులతో కూడిన కమిటీలను వేశామని, వారంతా పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున జీఎస్టీ తగ్గించి వినియోగదారులకు మేలు చేకూర్చాయనీ, ఆ ప్రయోజనాలను వారికి సవివరంగా తెలియజేసేందుకు ఈ వేదిక దోహదపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద వ్యాపార సంస్థలతో పాటు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులను ఉత్సాహ పరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రోత్సహించేలా లక్కీ డ్రా ఉంటుందని వివరించారు. విశాఖ ప్రజలంతా సహకరించి షాపింగ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్. శేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, టూరిజం అధికారిణి జె. మాధవి, హోటల్స్ అండ్ టూరిజం అసోసియేషన్ ప్రతినిధి పవన్ కార్తీక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి