నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి

 నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి
- విద్య ఉన్న‌త‌ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది
- డిగ్రీతో పాటు నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవాలి
- న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశాల‌లో సైతం మెరుగైన అవ‌కాశాలు
– విశాఖ వేదికగా ప్రారంభమైన నర్సింగ్ విద్యార్థుల రెండు రోజుల రాష్ట్ర సదస్సు

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: 

నైపుణ్యాల‌తో మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎం.శ్రీ భ‌ర‌త్ అన్నారు. బీచ్ రోడ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31 వ ఎస్ ఎన్ ఏ ఐ ద్వై వార్షిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు 2025 ప్రారంభమైంది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఈ కార్యక్రమాన్ని లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్ అనే అంశంపై నిర్వహిస్తోంది. ముందుగా ఫ్లోరెన్స్ నైటేంగిల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా  ఎంపీ శ్రీ భ‌ర‌త్ మాట్లాడుతూ విద్య మెరుగైన అవ‌కాశాలను క‌ల్పిస్తుంద‌న్నారు. కేవ‌లం డిగ్రీ పొంద‌డానికే ప‌రిమితం కాకుండా ఉపాధికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను సైతం అందిపుచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అదే విధంగా న‌ర్సింగ్ విద్యార్థుల‌కు విదేశాల‌లో సైతం మెరుగైన అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ ఎంతో కీలకమని అన్నారు. విద్య మెరుగైన అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుందన్నారు. స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ ముందుకు సాగాల‌ని సూచించారు. అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌న్నారు. స‌ద‌స్సు ప్ర‌త్యేక సంచికను ఈ సంద‌ర్భంగా ఎంపీ శ్రీ భ‌ర‌త్ ఆవిష్క‌రించారు.

ఇండియన్ రెససిటెషన్ ఫెడరేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎ.స్.సి చక్రరావు మాట్లాడుతూ ప్రజలకు వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం పై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా సార్వత్రిక రోగనిరోధకత (యూనివర్సల్ ఇమ్యునేషన్) కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పోషించిన భూమిక అభినందనీయమని, దీని ఫలితంగా అనేక వ్యాధులను దేశం నుంచి నిర్మూలించడం సాధ్యపడిందని చెప్పారు. ఆదివాసి ప్రాంతాలలో ,కొండలలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వీరు చూపుతున్న చొరవ, ధైర్య సాహసాలను అభినందించాలని చెప్పారు. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను వివరించారు. అదేవిధంగా అత్యవసర సమయాలలో సిపిఆర్ చేసి రోగిని ప్రాణాలను రక్షించాల్సిన విధానంపై ప్రజలకు విస్తృత అవగాహనను పెంపొందించాలని సూచించారు. 

ట్రైన్డ్ నర్సెస్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు( సౌత్ రీజియన్) డాక్టర్ బి.వల్లి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు విభిన్న కోర్సులు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని కెరియర్ ను మలుచుకోవడంపై పెట్టాలని సూచించారు. తమ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న నెలవారి శాస్త్రీయ జర్నల్ విశేషాలు, దానిలో ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాలను విద్యార్థులకు వివరించారు. నిరంతరం నేర్చుకోవాలని తపనతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని విద్యార్థులు గ్రహించాలని చెప్పారు. 

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్ షంషీర్ బేగం మాట్లాడుతూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సు ప్రాధాన్యతలు, ప్రత్యేకతలను వివరించారు. విద్యార్థులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. 

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కార్యదర్శి ఏపీ ఎన్.ఎం.సి రిజిస్ట్రార్‌ ఆచార్య కె. సుశీల మాట్లాడుతూ సమిష్టి ప్రయాణంగా సాగుతున్న ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని చెప్పారు. భవిష్యత్ నాయకులుగా నేటితరం విద్యార్థులే నిలుస్తారని అన్నారు.  నాయకత్వ లక్షణాలను నిరంతరం మెరుగుపరచుకొంటూ ఇటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య ఎస్. జ్యోతి మాట్లాడుతూ ప్రత్యక్ష సామర్థ్యాలను, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే విభిన్న సవాళ్లను ఎదుర్కోవడానికి యువత సంసిద్ధులుగా ఉండాలని సూచించారు. నర్సింగ్ విద్యలో ఉన్నవారు మరింత ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆన్లైన్, సర్టిఫికెట్ కోర్సులను చేయడానికి దృష్టి సారించాలని చెప్పారు. నిరంతర జ్ఞానాన్వేషణతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాకారం అవుతుందని చెప్పారు. నర్సింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత వారు విభిన్న పదవులను, బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం పెరుగుతోందని పలు ఉదాహరణలతో వివరించారు. 

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ ఎస్.ఎన్.ఎ సలహాదారు డాక్టర్ ఎం.సత్య వల్లి అసోసియేషన్ లక్ష్యాలు, విధి విధానాలు, కార్యక్రమాలు, విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలను వివరించారు. 

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రంగోలి, పేపర్ ప్రజెంటేషన్, క్రీడలు, సాంస్కృతి అంశాలలో వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. వీరికి గురువారం జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులను ప్రధానం చేస్తారు.

కార్య‌క్ర‌మంలో ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్ పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్ పర్సన్ చంద్రశేఖర్, కార్య‌వ‌ర్గ సభ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న