సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలిరావాలి
సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలిరావాలి
-చిన్న కళాకారులకు ఉపాధి కలుగుతుంది
-ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది
- మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు
- డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్
విశాఖపట్నం, సెప్టెంబర్ 18
హైదరాబాద్ కే పరిమితం అవుతున్న తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు. విజయవాడలోని కె.ఎల్ యూనివర్సిటీలో వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన 5వ వెండితెర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కళాకారులు ఉన్నా, సరైన అవకాశాలు లేక జీవనం కూడా సాగించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా షూటింగులకు అనువైన ప్రదేశాలు ఆంధ్రాలో ఉన్నప్పటికీ పెద్ద స్థాయిలో సినిమా నిర్మాణాలు జరగడం లేదని తెలిపారు. ఆంధ్రలో కూడా సినిమా చిత్రీకరించి ఇక్కడ కళాకారులకు ఊతమివ్వాలని కోరారు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమాకూరుతుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా చిన్న కళాకారులకు అవార్డులు ప్రధానం చేసే కార్యక్రమాలు చేపడితే ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు K. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకుడు విష్ణు బొప్పన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నటులు సాయికుమార్, ఆలీ, పృధ్వీరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి