పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
విద్యలో నాణ్యత పెంపొందించే దిశగా పనిచేయాలి
పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలి
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
శతాబ్ది ఉత్సవాలలో భాగంగా అనుబంధ కళాశాలల ఫ్యాకల్టీకి ఎఫ్.డి.పి లు
అనుబంధ కళాశాలలతో ఏయూ రూరల్ అవుట్ రీచ్ కార్యక్రమాలు
ఫ్యాకల్టీ, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు
విద్యలో నాణ్యతను మరింత పెంపొందించే దిశగా అనుబంధ కళాశాలలు, విశ్వవిద్యాలయంతో కలిసి ముందుకు సాగాలని ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం కన్వెన్షన్ సెంటర్లో ఏయు అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ తో నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సక్రమంగా, పటిష్టంగా జరగాలని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా తాను కొన్ని లోపాలను గుర్తించానని వీటన్నిటికీ పరిష్కారాలను చూపిస్తున్నట్లు చెప్పారు.
పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్షా కేంద్రం రద్దు చేయడమే కాకుండా, కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. అదేవిధంగా బీఈడీ, న్యాయ కళాశాలలో పనితీరు మరింత మెరుగు పడాలని సూచించారు.
శతాబ్ది ఉత్సవాలలో భాగంగా అనుబంధ కళాశాల ను భాగస్వాములను చేస్తూ త్వరలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లను ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఏయూ అనుబంధ కళాశాల లను భాగస్వామ్యం చేస్తూ రూరల్ ఔట్రీచ్ కార్యక్రమాలను చేపడతామని దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అనుబంధ కళాశాలలో పనిచేసే ఫ్యాకల్టీ కి అవసరమైన కెరియర్ గైడెన్స్ అందించడానికి ఫ్యాకల్టీ మెంటార్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఉన్నత విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ 100 ఫ్యాకల్టీ, 10వేల మంది విద్యార్థులను ఏఐ, డీప్ లెర్నింగ్ రంగాలలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. అనుబంధ కళాశాలలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్భాగం అనే విషయాన్ని మరువరాదని చెప్పారు. అనుబంధ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. అనుబంధ కళాశాలలకు అవసరమైన మార్గ నిర్దేశకాన్ని విశ్వవిద్యాలయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు మాట్లాడుతూ అనుబంధ కళాశాల గుర్తింపు, ఫీజులు, కోర్సుల నిర్వహణ తదితర అంశాలను చర్చించడానికి, కళాశాలల సమస్యలను సైతం తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్( సిడిసి) డీన్ ఆచార్య టి.వెంకటకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడానికి బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా కళాశాలకు రాకపోతే తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి కళాశాలలో విద్యార్థులను డ్రగ్స్, మత్తు పదార్థాలకు కు దూరంగా ఉంచే విధంగా ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని చెప్పారు. కళాశాలలు నాక్ గుర్తింపుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
యూజీ పరీక్షలు డీన్ ఆచార్య నానాజీ రావు మాట్లాడుతూ ప్రతి కళాశాల విద్యార్థులు ఏ.బి.సి ఐ డి లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాలను విశ్వవిద్యాలయం పంపడం తదితర ప్రక్రియల్లో పలు సమస్యలను కళాశాల యాజమాన్యాలకి వివరించి వీటిని సరిచేయాలని సూచించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు జరపడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా అనుబంధ కళాశాలకు సంబంధించిన పలు సమస్యలను అనుబంధ కళాశాలల అసోసియేషన్ కార్యదర్శి రమణాజీ వివరించారు. అసోసియేషన్ అధ్యక్షులు పైడా కృష్ణ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు బలరామకృష్ణ, గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు తదితరులు ప్రసంగించి పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో డీన్లు ఆచార్య కె. రమాసుధ, కె.శ్రీనివాసరావు, కె రాంబాబు, బి.మునిస్వామి, ఎస్ హరినాథ్, పి.శ్యామల, డి ఏ నాయుడు తదితరులు ప్రసంగించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి