ఫార్మసీ విద్యార్థినులకు అధునాతన వాష్ రూమ్స్
ఫార్మసీ విద్యార్థినులకు అధునాతన వాష్ రూమ్స్
– నిర్మించి అందించిన పూర్వ విద్యార్థి దేవా పురాణం
–వర్సిటీకి నిరంతర సహాయం అందిస్తున్న పూర్వ విద్యార్థి
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులకు అధునాతన వాష్ రూమ్స్ సమకూరాయి. బుధవారం ఉదయం ఫార్మసీ కళాశాల భవనంలో నూతనంగా నిర్మించిన వాష్ రూమ్స్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏయూ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ దేవా హెచ్ పురాణం తన సొంత నిధులతో తాను చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంకు సహాయాన్ని అందిస్తూ వీటిని నిర్మించారు. తన సొంత నిధులు దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించి అధునాతన రీతిలో వీటిని నిర్మించి ఫార్మసీ కళాశాలకు అందజేశారు. తన తల్లిదండ్రులు శ్రీమతి లలితాదేవి పురాణం శ్రీ కోటిలింగాల మూర్తి పురాణం పేరు మీదుగా విశ్వవిద్యాలయంలో నిరంతరం విద్యార్థినులకు ఉపయుక్తంగా అనేక కార్యక్రమాలను దేవా పురాణం నిర్వహిస్తున్నారు. గతంలో ఫార్మసీ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి లేదనే విషయాన్ని తెలుసుకుని నూతన హాస్టల్ నిర్మాణానికి అవసరమైన నిధులను అందించి తొలిసారిగా ఫార్మసీ విద్యార్థులకు ఒక అధునాతన హాస్టల్ నిర్మించి అందజేశారు. అనంతరం రసాయన శాస్త్ర విభాగ సమావేశం మందిరాన్ని ఆధునీకరించి విద్యార్థులకు ఉపయోగంగా తీర్చిదిద్దారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ భారతదేశము వచ్చిన ప్రతిసారి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తూ, ఇక్కడ అధికారులతో మమేకమవుతూ విశ్వవిద్యాలయ అవసరాలను తెలుసుకొని భవనాలు, ప్రయోగశాలలో యంత్ర పరికరాలు అందిస్తున్నారు. తాజాగా విద్యార్థినులకు అవసరమైన వాష్ రూమ్స్ నిర్మాణం చేసి అందించారు.
ప్రత్యేకంగా ఒక ఆర్కిటెక్ట్ ను నియమించి వారు సూచించిన విధంగా కార్పొరేట్ హోటల్స్, విమానాశ్రయాల్లో ఉండే తరహాలో వాష్ రూమ్స్ నిర్మాణం చేసి విద్యార్థినులకు ఉపయుక్తంగా తీర్చిదిద్దారు.
ఫార్మసీ కళాశాలలో అధిక శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఉపయుక్తంగా నిలిచే విధంగా వీటిని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తన ఉన్న తికి కారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తన వంతు సహకారాన్ని నిరంతర అందిస్తున్న దేవా పురాణం ఫార్మసీ కళాశాలకు, విద్యార్థినులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా వీటిని తన సొంత నిధులతో నిర్మాణం చేసి అందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య జి. గిరిజాశంకర్ మాట్లాడుతూ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికి పూర్వ విద్యార్థి దేవా పురాణం ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ అవసరాలను తెలుసుకొని తానే స్వయంగా వీటిని ఆధునీకరించి బహూకరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలుమ్నీ రిలేషన్స్ డీన్ ఆచార్య పి.శ్యామల మాట్లాడుతూ పూర్వ విద్యార్థిగా తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి సేవలు అందించడంతోపాటు తన తల్లి ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థినులకు ఉపయుక్తంగా నిలిచే మౌలిక వసతులు, భవనాలను నిర్మించి ఇస్తున్న దేవా పురాణం కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో విభాగ ఆచార్యులు ఆచార్య వి. గిరిజాశాస్త్రి, ఆచార్య కె.ఈశ్వర్ కుమార్, ఆచార్య ఏకేఎం పవార్, ఆచార్య పి. శైలజ, బీఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్థినిలు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి