ఏయూకి దివీస్ లేబరేటరీ 3.21 కోట్ల సి.ఎస్.ఆర్ నిధుల సహాయం
దివీస్ లేబరేటరీ 3.21 కోట్ల సి.ఎస్.ఆర్ నిధుల సహాయం
– 49.96 లక్షలతో కెమిస్ట్రీ లేబరేటరీ-2 ఆధునీకరణ
– 2.36 కోట్ల వ్యయంతో 72 ఆర్వో వాటర్ ప్లాంట్ల బహుకరణ
-గతంలో 36 లక్షలతో కెమిస్ట్రీ లేబరేటరీ-1 ఆధునీకరణ
-మౌళిక వసతుల కల్పనలో తోడ్పాటు
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 24:
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ దివీస్ లేబరేటరీ లిమిటెడ్ 3.21 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధుననీకరించిన కెమిస్ట్రీ లేబరేటరీ-2 ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తో కలిసి దివీస్ లాబరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్.వి రమణ, దివీస్ లేబరేటరీ జనరల్ మేనేజర్ వై.ఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలను 49.96 లక్షల వ్యయంతో పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. కొద్ది నెలల క్రితం 36 లక్షల వ్యయంతో కెమిస్ట్రీ లేబరేటరీ–1 ని కూడా ఆధునీకరించి అందించింది. పీజీ విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. ప్రయోగశాలలో అవసరమైన ఫ్లూమింగ్ ఛాంబర్, డ్రై ఒవేన్, వాక్యూమ్ ఒవేన్, రసాయనాలను నిల్వ చేసుకోవడానికి అవసరమైన స్టోరేజ్ సదుపాయం ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు వంటివి అందజేశారు.
అనంతరం ఏయూ పరిపాలన విభాగం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో ఏర్పాటు చేయడానికి అవసరమైన 72 ఆర్వో వాటర్ ప్లాంట్ యూనిట్లను బహుకరించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్, మిషనరీ, స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బహుకరించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు విభాగాలలో హాస్టల్స్ లో, ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలనే మహత్తర ఉద్దేశంతో దివిస్ లాబరేటరీ సామాజిక బాధ్యతగా వీటిని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అందించింది.
దివీస్ చైర్మన్ మురళీ దివీ ఉదార సహాయం..
ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే వేలాది మంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని డివిస్ లేబరేటరీస్ చైర్మన్ మురళి దివీ ఎంతో సహృదయతతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 3.21 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థులందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని మహత్తర ఆశయంతో 2.36 కోట్ల వ్యయంతో 72 వాటర్ ప్లాంట్లను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అందజేశారు. ఇప్పటికే విభాగాలలో వీటిని నిర్మించి వినియోగంలోనికి తీసుకువచ్చారు. అదేవిధంగా రసాయన శాస్త్ర విభాగ విద్యార్థులకు ప్రయోగశాలలు ఎంతో అవసరం. దీని ప్రాధాన్యత తెలిసిన మురళి దివీ నూతనంగా 49.96 లక్షలతో రసాయన శాస్త్ర ప్రయోగశాలను పూర్తిస్థాయిలో ఆధునీకరించి అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది ఆంధ్ర విద్యాలయానికి బహుకరించారు. కొద్ది నెలల క్రితం ఇదే విభాగానికి అవసరమైన మరొక ప్రయోగశాలను సైతం దాదాపు 36 లక్షల వ్యయంతో ఆధునీకరించి ఏయుకు అందజేశారు. మూడు కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక వసతులను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దివిస్ లాబరేటరీ సంస్థ సామాజిక బాధ్యతగా అందించింది.
మా కుటుంబ సభ్యులలో పలువురు, మా సంస్థల్లో పని చేస్తున్న అనేకమంది ఉద్యోగులు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు కావడం సంతోషదాయకం. ఎంతోమందికి ఉన్నత విద్యను అందిస్తూ, వారి అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మా సంస్థ తరఫున సిఎస్ఆర్ నిధుల నుంచి నేడు ఈ రూపంలో సహకారంగా అందించడం జరిగిందని సంస్థ చైర్మన్ మురళీ దివిస్ తన సందేశంలో తెలియజేశారు
దివీస్ లేబరేటరీ అందించిన ఆర్వో వాటర్ ప్లాంట్లను ఆర్ట్స్ కళాశాలలో 10, సైన్స్ కళాశాలలో 14, ఫార్మసీ కళాశాలలో 2, న్యాయ కళాశాలలో ఒకటి, ఇంజినీరింగ్ కళాశాలలో 11, మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 2, ఐఏఎస్ఈ లో ఒకటి, దూరవిద్యా కేంద్రంలో ఒకటి పరిశోధకుల హాస్టల్ లో 3, మహిళా హాస్టల్స్ లో 3, బాలుర హాస్టల్స్ లో 10, అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్ లో 3, ఇతర కార్యాలయాలలో 11 ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం వ్యాప్తంగా అన్నిచోట్ల పరిశుభ్రమైన త్రాగునీరు లభించే విధంగా వీటిని ప్రణాళికాయుతంగా ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో భాగంగా ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దివిస్ లేబరేటరీ యాజమాన్యానికి, సంస్థ చైర్మన్ మురళి దివీకి విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మౌలిక వసతులు విద్యార్థుల ఆరోగ్యానికి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పరిశ్రమలు, దాతలు స్వచ్ఛందంగా ఇటువంటి విరాళాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి సహకారాన్ని అందించాలని కోరారు.
కార్యక్రమంలో రెక్టార్ ఎన్.కిషోర్ బాబు రిజిస్టర్ ఆచార్య ఈ ఎన్ ధనంజయరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, దివిస్ లేబరేటరీ సి.ఎస్.ఆర్ మేనేజర్ డి.సురేష్ కుమార్ ఆచార్య కె.బసవయ్య తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి