ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి

 ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి 

- ప్రత్యామ్నాయల పై దృష్టి సారించాలి 

- పర్యావరణహితంగా జీవనం ఉండాలి 


విశాఖపట్నం మే 4: 

పర్యావరణహితంగా, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా మానవ జీవన విధానం ఉండాలని కృష్ణ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎస్.రామకృష్ణారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు విద్యా విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రత్యేక ప్రసంగం అందించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎస్.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు వస్తున్నాయని వాటిని వినియోగించడం వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. వియత్నాం దేశంలో అరటి గుజ్జుతో ప్లేట్లు తయారు చేస్తున్నారని, యూరప్ లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తున్న విధానాలను వివరించారు. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం, ప్యాకింగ్ చేయడం అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. పౌరులు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సైతం ప్లాస్టిక్ రీసైకిల్ చేసే యూనిట్లను నిర్వహించే వారికి ప్రత్యేక రాయితీలను కల్పిస్తోందని అన్నారు. ప్రజల వైఖరి, ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతరం మార్పుకు మూలకంగా మారాల్సిన అవసరాన్ని వివరించారు. ప్లాస్టిక్ ఉపయోగించి రోడ్ల నిర్మిస్తున్న విధానాన్ని తెలియజేశారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తుందని ఇవి సులభంగా భూమిలో కలిసిపోతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు చట్టాలను వివరించారు. 

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణానికి ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ఆసక్తిదాయకంగా వివరించారు. అనంతరం విద్యార్థులతో పర్యావరణహిత జీవనం సాగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సేవ్ ఎన్విరాన్మెంట్ - బ్యాన్ ప్లాస్టిక్ అని నినదించారు. 

విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ పై యుద్ధాన్ని చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న కొలది ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా పెరిగిపోయిందని ఇది పర్యావరణానికి, ముఖ్యంగా పుడమికి ఎంతో హాని చేస్తోందని అన్నారు. సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు మానవ శరీరంలోకి, రక్తంలోకి చేరుతున్న విధానాలను ఇటీవల మనం చూస్తున్నామని అన్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటిని సక్రమంగా వినియోగించడం రీసైకిల్ చేయడం ఎంతో అవసరమని వివరించారు. గాలి కాలుష్యం, నీ కాలుష్యం, నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. పర్యావరణానికి జరిగే హాని ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వివరించారు.

ప్రజలు సామాజిక స్పృహతో పాటు, పర్యావరణ స్పృహను కలిగి ఉండాలని చెప్పారు.  పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల పరిసరాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ రాము, బిఈడి విద్యార్థులు, బీఈడీ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న