ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం

 ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం 
– పర్యావరణహితంగా మన జీవన విధానం ఉండాలి
– పర్యావరణ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ 

విశాఖపట్నం జూన్ 3: 

ప్రజలందరి భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. జూన్ 5 ఏయు విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితంగా మన జీవన విధానాన్ని మలచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా నిలిచే బి.ఈ.డి, ఎంఈడి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. తద్వారా వారు పాఠశాల స్థాయి నుంచి చిన్నారులలో పర్యావరణ స్పృహను పెంపొందించడం, సంరక్షించే బాధ్యతను వారికి అందించడం జరుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే మానవ మనుగడ సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని తదనగుణంగా నడుచుకోవాలని సూచించారు.

విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు మాట్లాడుతూ పర్యావరణంలో అనేక జీవులు, వృక్షాలు పరస్పరం సహకారంతో ముందుకు సాగుతాయని చెప్పారు. వీటన్నింటిని సంరక్షించడం, పరిరక్షించడం భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మారే బీఈడీ ఎంఈడి విద్యార్థులకు ఈ దిశగా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని జరుగుతున్నట్లు తెలిపారు. పర్యావరణ శాస్త్ర నిపుణులతో ప్రత్యేక ప్రసంగాలను ఏర్పాటు చేసి పర్యావరణ ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుందని అన్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతను, వృక్షాలను నాటి సంరక్షించే బాధ్యతను ప్రతి విద్యార్థి స్వీకరించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ దిశగా మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్ తరాలకు ముందడుగుగా నిలుస్తుందని అన్నారు. నేల సారాన్ని పెంపొందించడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరమని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అమ్మ పేరుతో ఒక మొక్క సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా కోటి మొక్కలు నాటాలననే సంకల్పంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని అన్నారు. మానవ జీవితం ప్రకృతితో మమేకమై ముందుకు సాగాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వీలైనంతవరకు ప్రకృతి హిత వస్తువులను ఉపయోగించడం ఎంతో అవసరమని చెప్పారు. సరళ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విభాగాచార్యులు ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ ప్రవీణా దేవి, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న