మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు
అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు
బీచ్ రోడ్, కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమాల్లో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్
విశాఖపట్టణం, మే 28 ః
ఆంధ్రప్రదేశ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో వేడుకలను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్ లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామ్యమై ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు సేవలను కొనియాడారు. ఆయన అత్యంత క్రమశిక్షణ కలిగి జీవితంలో ఉత్తమ స్థానాలకు చేరుకున్నారని, రాష్ట్ర ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, కళా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి ఘన కీర్తిని సొంతం చేసుకున్నారన్నారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయారని పేర్కొన్నారు. 1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలు ఇవ్వటమే కాకుండా ఆచరణలో పెట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయులని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు... శక్తి... మనందరికీ స్ఫూర్తి అని కలెక్టర్ అన్నారు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన రామారావు, తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రికాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ, 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందించిందని గుర్తు చేశారు. సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని 2023 ఆగస్టు 28న విడుదల చేసినట్లు వివరించారు. పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన అలాంటి వ్యక్తి అడుగు జాడల్లో మనమంతా నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉపకలెక్టర్లు మధుసూదన రావు, శేషశైలజ, సీఎంవో నరేష్ కుమార్, పలువురు జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి