స్వచ్ఛత నిత్యజీవితంలో భాగం కావాలి

 స్వచ్ఛత నిత్యజీవితంలో భాగం కావాలి 
- స్వచ్ఛభారత్ కార్యక్రమం క్రమశిక్షణను నేర్పింది 
- ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి 

విశాఖపట్నం మే 17: 

స్వచ్ఛత ప్రజల జీవనంలో అంతర్భాగంగా మారాల్సిన అవసరం ఉందని శాసనమండలి పూర్వ సభ్యులు పి.వి.ఎన్ మాధవ్ అన్నారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని బీఈడీ విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కేవలం పరిశుభ్రత గురించి కాకుండా ప్రజల్లో క్రమశిక్షణను కూడా పెంపొందించిందని చెప్పారు.  అదేవిధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత దేశ వ్యాప్తంగా వచ్చిన మార్పులను ప్రపంచ దేశాలు పరిశీలించాయని, దీనిని అనుసరించడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇది కేవలం అంతర్గతంగా పరిశుభ్రతను పెంచడమే కాకుండా ప్రజల ఆలోచనలను, దృక్పథాలను ఎంతగానో ప్రభావితం చేసి ఒక మంచి మార్పుకు కారణంగా నిలిచిందని వివరించారు.


 స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గాంధీజీ ఆలోచనలు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న నాటి నుంచి స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారని, తాను నిర్వహించిన ఆశ్రమాలలో సైతం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాలను వివరించారు. టాయిలెట్స్ ను శుభ్రం చేయాలనే నిబంధన పెట్టి దానిని అమలు చేసే వారిని గుర్తు చేశారు. నాటి నుంచి ఆయన ఈ భావాలను ప్రజలలో బలంగా పంపడానికి నిరంతరం తపించే వారిని చెప్పారు.

 గాంధీజీని స్వాతంత్ర సాధనకు ప్రజలందరినీ నడిపించిన నాయకుడిగా అందరూ చూస్తారని వీటితోపాటు ఆయన అనేక సంస్కరణలకు మార్గం చూపారని చెప్పారు. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో గాంధీజీ ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమిస్తూ ఆయన చేసిన ప్రయాణాన్ని ఆసక్తి అధికంగా విద్యార్థులకు వివరించారు. ఇదే స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు. 

విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నేటితరం విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా దేశ అభివృద్ధికి ఉపయుక్తంగా నిలిచే విలువైన మానవ వనరులుగా భారతదేశ యువతను తయారు చేయాలని పిలుపునిచ్చారు. బిఈడి విద్యార్థులకు విభిన్న రంగాలలో నిపుణులతో ప్రత్యేక ప్రసంగాలను నిర్వహిస్తూ సమాజ అవసరాలను తెలియజేసే విధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 

జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్  భారత్ 2047 సాధన దిశగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సానుకూలంగా ఆలోచన చేస్తూ భవిష్యత్ తరాలకు ఉజ్వల భవితను అందించే దిశగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల చిన్నారుల్లో స్వచ్ఛత యొక్క ప్రాధాన్యతను వివరించడం వారిని ఈ దిశగా నడిపించడం గురుతర బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా చూడడం సాధ్యపడుతుందని, అదేవిధంగా ఆరోగ్యవంతమైన చిన్నారులను, యువతను మనం దేశానికి అందించడం సాధ్యపడుతుందని చెప్పారు. పరిశుభ్రమైన, హరితమయంగా నిలిచే పరిసరాలను అభివృద్ధి చేయాలని తద్వారా విద్యలో కూడా చిన్నారులు అద్వితీయమైన ప్రతిభను చూపడం సాధ్యపడుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన పరిసరాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.

అదే విధంగా  స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ – స్వచ్ఛభారత్ నినాదాన్ని ముందుకు తీసుకు వెళుతూ ప్రతి నెల మూడో శనివారం విభాగ విద్యార్థుల ఆధ్వర్యంలో కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్న విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ రాము, డాక్టర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న