ఆహా ఆవకాయ్...

 ఆహా ఆవకాయ్...

తెలుగు ప్రజల్లో ప్రతి వంటింటిలో ఆవకాయ జాడీలు కొలువు తీరుతాయి. ఏడాదంతా ప్రతి సందర్భంలోనూ ఎన్ని పిండి వంటలు ఉన్నా ఆవకాయకు స్థానం ఎంతో ప్రత్యేకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆవకాయని కేవలం వేసవికాలంలో మాత్రమే పెడతారు. ఈ కాలంలో లభించే మామిడికాయలతో సుమారు పది రకాలకు పైగా ఆవకాయలు పెట్టడం మన తెలుగు వారికి వెన్నతో పెట్టిన విద్య. మహిళలు సంవత్సరాలుగా ఆవకాయను పెడుతూ దానిలో ఎన్నో మెలకువలు నేర్చుకుని, వారి చేతితో పెట్టిన ఆవకాయతో ఎందరికో ఆహా ఆవకాయి అనిపించుకుంటారు. 

ఆవకాయ్ పెట్టడంలో చేయి తిరిగిన మహిళలందరూ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది. వారంతా కలిసి ఆవకాయ పెడితే దాని రుచి వర్ణించడం సాధ్యం కాదు, సరిగ్గా ఇదే జరిగింది. విశాఖలోని హోటల్ ఓషన్ విస్టా బేలో మంగళవారం సాయంత్రం మహిళలకు ఆవకాయ తయారు చేసే ఒక పోటీ నిర్వహించారు. సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం, 3 మ్యాంగో స్పైసెస్ అండ్ పికెల్స్ సంస్థలు సంయుక్తంగా  ఆహా ఆవకాయ అనే పోటీని నిర్వహించాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ చేతితో పెట్టిన ఆవకాయని రుచి చూపించారు. మామిడికాయ ముక్కలకు ఆవపిండి, 3 మ్యాంగోస్ కారంపొడి, తగినంత ఉప్పు, నూనెను జోడించి తమదైన శైలిలో తయారుచేసిన ఆవకాయతో అందరిని ఆహా అనిపించారు. వీరు తయారు చేస్తున్న ఆవకాయని చూస్తుంటే, దాని నుంచి వచ్చే ఆవఘాటుని ఆస్వాదిస్తూ ఉంటే అక్కడే అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకుని తినాలి అనే అంతగా మనసు ఉవ్విళ్లూరింది . 

విశాఖ మహిళలు తమ దశాబ్దాల ఆవకాయ తయారు చేసే సామర్థ్యాన్ని ఈ వేదికపై పంచుకున్నారు. ఆవకాయ పెట్టడంలో మెలకువలు పలువురు వివరించారు. ఎన్ని రకాల ఆవకాయలు పెట్టవచ్చు... ఏ ఏ ఆవకాయ్ కి ఏ విధమైన పాళ్లు వెయ్యాలి అనే అంశాలను వేదికపై పంచుకున్నారు. వీరికి త్రీ మాంగో స్పైసెస్ అండ్ పికిల్ సంస్థ బహుమతులను అందించింది. 

కార్యక్రమానికి ఆద్యంతం ఆర్జే ప్రదీప్ (బాబాయ్), ఆర్జే కృష్ణ (అబ్బాయి), ఆర్జె షర్మిల, ఆర్జె భావన, ఆర్జె మధు కార్తిక్ లు తమదైన శైలిలో వ్యాఖ్యానం చేస్తూ అందరిని ఒక ఆనంద సాగరంలో విహరించేలా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామింగ్ హెడ్ సుష్మ సమన్వయం చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న