రామ కళ్యాణం... ప్రజలను ఐక్యం చేస్తుంది

 రామ కళ్యాణం ...  ప్రజలను ఐక్యం చేస్తుంది 


విశాఖపట్నం > డా.వేదుల నరసింహం




భారతదేశంలో శ్రీరామచంద్రుని ఆలయం లేని గ్రామం ఉండదు. శ్రీరామచంద్రమూర్తి కుటుంబంతో భారతీయులకు ఉన్న అనుబంధం అటువంటిది. ప్రతి గ్రామంలో శ్రీరామచంద్రుని ఆలయం, గ్రామ పొలిమేరలో రామ బంటు హనుమంతుల వారి నిలువెత్తు విగ్రహాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి. భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఇవి మారిపోయాయి. పట్టణాల నుంచి కాస్త దూరంగా పల్లెటూర్ల వైపు ప్రయాణం చేస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. పల్లెలతో శ్రీరాముడు కి ఎందుకు ఇంతటి అనుబంధం ఏర్పడింది అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది.



 ప్రతి సంవత్సరం గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలను, రామ కళ్యాణాన్ని ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. గ్రామాల్లో కేవలం శ్రీరాముని కళ్యాణమే కాకుండా దసరా ఉత్సవాలను, వినాయక చవితి ఉత్సవాలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. మరి వీటన్నిటికంటే శ్రీరామనవమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము.





 గ్రామీణ మూలాలు కలిగిన వారికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీరామనవమి వచ్చింది అంటే గ్రామంలో ప్రతి ఇంటిలోనూ ఒక పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది. లోక కళ్యాణార్థం నిర్వహించే రామ కళ్యాణాన్ని ప్రతి కుటుంబం వీక్షించడం, శ్రీరామచంద్రుని కళ్యాణ అక్షింతలను శిరస్సున దాల్చడం తప్పనిసరిగా జరుగుతుంది. కూలి పని చేసుకునే వారు సైతం ఆ రోజు పనికి సెలవు పెట్టుకుని రామాలయాన్ని సందర్శించడం, తమ శక్తి కొలది కొబ్బరికాయ, అరటిపండు,పానకం, వడపప్పు, బెల్లం ఇటువంటి పదార్థాలను శ్రీరామచంద్రునికి అర్పించి స్వామి సన్నిధిలో జరిగే కళ్యాణాన్ని వీక్షించి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటారు. దీన్నే వారు ఆచరిస్తారు. 



శ్రీరామ కళ్యాణం గ్రామంలో ధనిక పేద అనే భావాన్ని రూపుమాపడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ కళ్యాణంలో గ్రామస్తులు అందరూ పాల్గొనడం, స్వయంగా తమకు ఉన్న శక్తి కొలది పువ్వులు, పండ్లు, పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించడం కల్యాణాన్ని జరిపించడం జరుగుతుంది. అందుకే గ్రామాలలో రాముడి పెళ్లి అంటే ఇది తమ ఇంటిలో పెళ్లి అన్న విధంగా ప్రతి వ్యక్తి ఒక బాధ్యతను స్వీకరించి ఈ కళ్యాణంలో భాగస్వామి గా మారతారు. 



సీతారాముల కళ్యాణం ముగిసిన వెంటనే ప్రతి గ్రామంలో సామూహిక భోజనాలను ఏర్పాటు చేసుకుంటారు. మన ఇంటిలో పెళ్లి జరిగితే ఏ విధంగా బంధువులందరినీ పిలిచి కడుపునిండా అన్నం పెడతామో రాముల వారి కళ్యాణము తర్వాత కూడా ఇదే విధంగా గ్రామస్తులందరూ కలిసి ఒకే చోట భోజనాలను చేయడం సాంప్రదాయంగా వస్తోంది. నేటికీ అనేక గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామస్తులు అందరికీ సామూహిక భోజనాలు నిర్వహించడం మనం చూడవచ్చు. కొన్ని గ్రామాలలో తాటాకు పందిళ్ళ స్థానంలో ఆధునిక టెంట్లు వచ్చినా, నేల మీద కూర్చుని భోజనం చేసే స్థానంలో టేబుల్ లో కుర్చీలు వచ్చినప్పటికీ నేటికీ బంతి భోజనాలు సాగుతున్నాయి. బూరెలు, పులిహార, రెండు కూరలు, పప్పు పులుసు, పెరుగు, కొత్త ఆవకాయ ఇలా విభిన్న రకాల పిండివంటలతో ఈ భోజనాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ భోజనాలలో అన్ని కులాల వారు, అన్ని మతాలవారు  పాల్గొనడం, భాగస్వాములు కావడం మనం చూడవచ్చు. గ్రామాలలో ప్రజల మధ్య ఐక్యతను, స్నేహ భావాన్ని పెంపొందించే విధంగా శ్రీరామనవమి సామూహిక భోజనాలు నిలుస్తున్నాయి.



 మీలో ఎవరికైనా గ్రామీణ మూలాలు ఉంటే తప్పనిసరిగా మీరు కూడా ఈ అనుభవాన్ని, అనుభూతిని స్వయంగా పొంది ఉంటారు. ఇటువంటి అనుభవాన్ని పొందని వారు వచ్చే సంవత్సరం తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న, తెలిసిన గ్రామంలో జరిగే సీతారాముల కల్యాణానికి వెళ్ళండి. ఆ గ్రామస్తులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా గౌరవించి పెళ్లి భోజనాన్ని మీ కడుపునిండా పెట్టి పంపిస్తారు. ఇది గ్రామస్తుల ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న