అపురూప దర్శనం..చూసిన కనులదే భాగ్యం...

 ఏడాదిలో ఒక్కరోజే దర్శన భాగ్యం....

సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూపాన్ని వీక్షించే అదృష్టం భక్తులకు కలుగుతుంది. వరాహ నారసింహ అవతారాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న సింహాద్రి నాథుడి నిజరూపాన్ని వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈరోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తుల విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూపంలో సంవత్సరంలో ఒక్క రోజున మాత్రమే అక్షయ తృతీయనాడు దర్శనమిస్తారు. ఆ రోజున స్వామి వారిని లక్షలాదిమంది దర్శించుకుని భక్తి పారవస్యంతో పునీతులవుతారు.  ఏడాది పొడవునా చందనం పూతతో ఉంటూ శాంతమూర్తిగా దర్శనమిచ్చే వరాహస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు...

త్రిలోకాలలో నారసింహుని వంటి దైవం, సింహాచల క్షేత్రం వంటి పుణ్యక్షేత్రం, నిరంతరం ప్రవహిస్తూ మనల్ని పునీతులను చేసే గంగధార వంటి తీర్థం లేదని చెబుతుంటారు. ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చిన నరసింహ స్వామి సింహగిరిపై వరాహ నారసింహ అవతారంలో దర్శనమిస్తున్నారని పురాణాలు చెబుతాయి. 

శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించడానికి వరాహ నరసింహస్వామిగా భూమిపైకి వచ్చాడని మనందరికీ తెలుసు. అయితే ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన వరాహ నృసింహస్వామి ఎంతోకాలం పూజలు అందుకోలేదు. దీనితో స్వామిపై పెద్ద పుట్ట పెరిగిపోయింది. ఒకనాడు పురూరవుడు, ఊర్వశితో కలిసి ఆకాశమార్గంలో విహరిస్తూ సింహగిరి క్షేత్రం పైభాగానికి చేరుకుంటాడు. ఆ రాత్రి అక్కడే నిద్రించగా పురూరవ చక్రవర్తికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఈ పర్వతంపై తాను ఉన్నానని, తనకు పూజలు చేసి ఆరాధించాలని సూచిస్తాడు. స్వామి కోసం కొండపై ఎంత వెతికినా స్వామికి సంబంధించిన ఆనవాళ్లు లభించక పురూరవుడు ఆవేదన చెందుతాడు. అనంతరం ఆరోజు రాత్రి మరోసారి స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై సింహగిరిపై ఈశాన్య దిక్కున ప్రవహించే గంగధారకు సమీపంలో గల పుట్టలో తాను ఉన్నట్లు చెబుతారు. వైశాఖ శుక్లపక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు స్వామిని పురూరవ చక్రవర్తి గుర్తిస్తాడు. గంగాధర జలాలు, ఆవు పాలు, పంచామృతాలతో స్వామిని అభిషేకించి ఆరాధిస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి రూపంలో స్వామి తన వానిని వినిపిస్తూ పుట్టలో ఉన్నందున చల్లగా ఉందని, తనకు చల్లదనం కోసం పుట్టమన్నకు బదులుగా గంధాన్ని లేపనంగా పోయామని కోరుతాడు. పుట్టమన్నుతో సమానమైన సిరిగందాన్ని స్వామి పై పూతగా పూశారు. నాటి నుంచి నేటి వరకు వరాహ నరసింహస్వామిని చందనంతో కప్పి ఉంచుతారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున స్వామి శరీరంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలో భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తిరిగి అదే రోజున 3 మడుగుల సిరి చందనాన్ని స్వామికి పూతగా సమర్పిస్తారు. 

అక్షయ తృతీయ నాటి నిజరూప దర్శనానికి ప్రణాళిక చైత్ర బహుళ అమావాస్య  (గంధం అమావాస్య) నుంచి ప్రారంభం అవుతుంది. చైత్ర బహుళ అమావాస్యను గంధం అమావాస్య అంటారు. అదే రోజు తెలుగువారే కాకుండా  ఒరిస్సా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వేంచేసి ఇక్కడే వండుకుని తిని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు. స్వామికి అర్పించే 12 మాడుగుల చందనం నాలుగు విడతలుగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో బహుళపక్ష ఏకాదశి పర్వదినాన చందనం అరగదీత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆలయ బేడా మండపంలో పండితులం వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత నాణ్యమైన గంధం చెక్కలను అరగదీసి చందనాన్ని ముద్దగా సిద్ధం చేసి ఉంచుతారు. దీనిలో ఔషధ, సుగంధవ్యాలను మిళితం చేస్తారు. చందన యాత్రకు ముందు రోజు రాత్రి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

అక్షయ తృతీయ నాడు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి బంగారం, వెండి బొరుగులతో చందనాన్ని ఒలుస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామి శిరస్సు పైన, చాతీపైన చలువ చందనాన్ని ముద్దలుగా పెడతారు. పాత చందనాన్ని తొలగించిన తరువాత అభిషేకం, ఆరాధన నిర్వహిస్తారు. స్వామివారిని నిజరూపంలో మొదట ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు దర్శించుకుంటారు. అక్షయ తృతీయ రోజు రాత్రి వరకు నిజ రూపంలో ఉన్న స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. సంప్రదాయ బద్ధులైన శ్రీ వైష్ణవ స్వాములు గంగధార నుంచి తీసుకువచ్చే పవిత్ర జలాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. భక్తుల దర్శనాలను నిలిపివేసి తొలి విడత చందన సమర్పణ చేస్తారు. తొలి విడతలో స్వామి వారిపై మూడు మణుగులు అనగా సుమారు 25 కిలోల సిరి చందనాన్ని పూతగా పూస్తారు. మిగిలిన 9 మణుగులు చందనాన్ని వైశాక పౌర్ణమి, జేష్ఠ పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి లలో మూడేసి మణుగులు చొప్పున స్వామి పై పూతగా పూస్తారు. నాలుగు విడతల చందన సమర్పణతో కార్యక్రమం పూర్తవుతుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు మరలా ఏడాది కాలం వేచి చూస్తారు. నిత్యం స్వామి చందనం పూతలో భక్తులకు దర్శనమిస్తూ వారిని ఆశీర్వదిస్తుంటారు. 

సింహాచల క్షేత్రానికి మరొక ప్రత్యేకత ఉంది. సర్వ దేవతల స్వరూపంగా భావించే గోమాతను సింహాద్రినాథుడికి అర్పించడం తరతరాలుగా ఒక ఆనవాయితీగా వస్తోంది. కోరిన కోర్కెలు తీరిన వెంటనే భక్తులు గోవులను, కోడెదూడలను స్వామివారికి బహుమతిగా ఇస్తుంటారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనము చేసుకొని తమ మనసులో ఉన్న కోరికలు చెబితే తప్పకుండా నెరవేరుతాయి అనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. 

సింహాద్రినాథునికి నిత్యం పూజలతోపాటు ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు. వేకువజామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. తరువాత బాల భోగం నివేదన చేస్తారు. బాల భోగ నివేదనకు పొంగలి, పులిహోర, దద్దోజనం ఆలయ పోటులో తయారుచేసి పవిత్రంగా స్వామికి అందిస్తారు. అదేవిధంగా 11 గంటల 30 నిమిషాలకు భక్తుల దర్శనాలు నిలిపివేసి, మహా నివేదన (రాజభోగం) పెడతారు. దీనిలో స్వామివారికి అన్నం, పప్పు, కూర, రసం, పెరుగు, లడ్డు నివేదన చేస్తారు. రాత్రి  ఆరాధన తర్వాత పవళింపు సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా వడలు, శనగలు, పాలు నివేదనగా అందిస్తారు. బాల భోగం, రాజభోగం, పవళింపు సేవలో స్వామికి నివేదించిన ప్రసాదాలను సిబ్బందికి, భక్తులకు అందిస్తారు. అదేవిధంగా భక్తులకు ఉచిత ప్రసాదంగా నిత్యం కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పులిహార ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. స్వామివారికి నివేదించే ప్రసాదాలను తయారు చేయడానికి కొండపై నుంచి నిత్యం ప్రవహించే గంగధార, వంటధార నుంచి తీసుకువచ్చిన నీటితో ప్రసాదాలను సిద్ధం చేస్తారు.

సింహాచల క్షేత్రంలో ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 గంటలకు ప్రభాత ఆరాధన, 5:30 గంటలకు తీర్థ గోష్టి, బాలభోగం నివేదన, ఉదయం 6:30 నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఉదయం 11:30 నుంచి 12:30 వరకు రాజబోగం సమయంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి 3:15 వరకు పవళింపు సేవ నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆరాధన జరిపిన అనంతరం, రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు దర్శనాలను కొనసాగిస్తారు. రాత్రి 9 గంటలకు పవళింపు సేవ చేసి కవాట బంధనంతో ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు, వార్షిక ఉత్సవాల సమయంలో దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. వీటితో పాటు స్వామివారికి నిత్య కళ్యాణం, గురు- ఆదివారాలలో స్వర్ణ సంపెంగలతో పూజ, సహస్రనామ తులసీ దళార్చాన, స్వాతి నక్షత్ర హోమం,ఏకాదశి పర్వదినాన స్వర్ణ తులసి దళార్చన, భక్తులు కోరిన రోజున గరుడసేవ, నిత్యం కప్పస్తంభ ఆలింగనం, శ్రీ లక్ష్మీ నారాయణ వ్రతం నిర్వహిస్తారు.

విశాఖ నగరంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని తెలుగు ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్న ఒడిస్సావాసులు సైతం పెద్ద సంఖ్యలో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వీరు ప్రత్యేకంగా శనివారం రోజున స్వామి దర్శనానికి వందల సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతి శనివారం సింహగిరిపై ఒడిస్సా భక్తుల సందడి మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది.


స్వామివారికి తులసీ దళాలతో పాటు బంగారు వర్ణంలో మెరిసిపోయే సంపెంగలను అర్పించడం ఇక్కడ ప్రత్యేకత. సింహగిరిపై అడుగడుగునా సంపెంగ వృక్షాలు ఉంటాయి. వీటి నుంచి పువ్వులను సేకరించి స్థానికులు మాలలుగా తయారు చేసి ఆలయం వద్ద విక్రయిస్తుంటారు. భక్తులు వీటిని కొనుగోలు చేసి స్వామివారికి అర్పించి, అలంకరిస్తారు.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న