Support Our Students: Yarlagadda Appeals to Telugu CEOs in Canada
మన విద్యార్థులకు చేయూతనివ్వండి
కెనడాలోని వాణిజ్య, ఉద్యోగ సంస్థల తెలుగు సి.ఇ.వో లకు యార్లగడ్డ విజ్ఞప్తి
విశాఖపట్నం > డా. వేదుల నరసింహం
టొరంటో (కెనడా)-
గత సంవత్సర కాలంగా ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన పిమ్మట అమెరికా-కెనడా, కెనడా-భారత సంబంధాల కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వలన కెనడాలోని తెలుగు విద్యార్థులు ఉపకార వేతనాలు, ఉద్యోగాల విషయంలో ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల నుండి బయటపడటానికి తగిన చేయూతనివ్వాలని కెనడాలోని వివిధ సంస్థల తెలుగు సీ.ఇ.వో లకు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ పూర్వసభ్యుడు, పద్మభూషణ్ సత్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం టొరంటో నగరంలోని బంజారా ఇండియా రెస్టారెంట్ లో పలువురు తెలుగు సీ.ఇ.వో లతో సమావేశం అయ్యారు. ఇక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, అందుచేత కెనడాలోని తెలుగు సంఘాలతో చర్చించి, మన విద్యార్థులకు ఉపకార వేతనాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, అర్హతలున్న వారికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని యార్లగడ్డ వారిని కోరారు. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులందరూ తామంతా అదే పనిలో ఉన్నామని చెప్పారు. గతంలో చదువు కోసం వచ్చిన తెలుగు వారిలో 80 శాతం వర్క్ పర్మిట్లు, తరువాత ఉద్యోగాలు పొందే వారిని ప్రస్తుతం అది 20 శాతంకు పడిపోయిందని వారు చెప్పారు. చాలామంది ఇక్కడ ఉండాలో, తిరిగి వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారని, వారికి వీలైనంత సహాయం చేస్తామని ఆ సంస్థల ప్రతినిధులు చెప్పారు.
ఆచార్య యార్లగడ్డ గతంలో కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన సందర్భంగా ఈ సంస్థల ప్రతినిధులతో ఏర్పడిన పరిచయాల కారణంగా ఈ చర్చలు సానుకూలంగా సాగాయి.
ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ "నమస్తే కెనడా" పత్రిక యజమాని, ప్రముఖ హిందీ సాహితీవేత్త శ్రీ శరణ్ ఘయ్ ను, తెలుగు ఖతులను (ఫాంట్ లను) తయారుచేసిన వారిలో తొలి విదేశాంద్రులు, రచయిత శ్రీకృష్ణ దేశికాచార్యులను విశ్వ హిందీ పరిషత్ తరపున సత్కరించారు.
ఈరోజు ఉదయం విండ్ సర్ నగరంలో కెనడాలోని అతిపెద్ద టాక్స్ కన్సల్టెంట్ సంస్థ అయిన 'లిబర్టీ టాక్స్' కు 8 కెనడా నగరాలలో కార్యాలయాలు కలిగిన తెలుగు ప్రముఖులు సూర్య బెజవాడ, విశాల్ బెజవాడ తో కూడా సమావేశమై ఆ నగరాలలో తెలుగు విద్యార్థులకు సహాయం అందించమని కోరారు.
ఈ సమావేశాలను బంజారా ఇండియా రెస్టారెంట్ అధిపతి వీరెళ్శ రాజేష్, మారియట్ హావీల్స్ లో ప్రముఖ బాధ్యత వహిస్తున్న పొతకమూరి భానుకుమార్ ఏర్పాటు చేశారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి