ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ

 ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ 

— నేటి నుంచి శతాబ్ది సంవత్సరం ప్రారంభం 
— ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక 
— 2026 ఏప్రిల్ 26న ఘనంగా శతాబ్ది  సంవత్సరం ముగింపు వేడుకలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. శనివారం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏడాది కాలం కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం పాలకమండలి సమావేశం మందిరంలో కోర్ కమిటీ సభ్యులతో వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరం  శనివారం ప్రారంభమై  ఏడాది కాలం పాటు ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం పొడుగునా అకడమిక్, ఔట్రీచ్, మెగా  ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. అదే విధంగా 2026 ఏప్రిల్ 26న శతాబ్ది సంవత్సర ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మెగా ఈవెంట్లను విభిన్న విభాగాలు సంయుక్తంగా, సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించాలన్నారు. సాధారణ సదస్సులకు భిన్నంగా ఈ మెగా ఈవెంట్ లు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సభ్యుల నుంచి కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలను స్వీకరించారు. 

ఏయూ  రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు కార్యక్రమా వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న వాకతాన్ ను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సిరిపురం వర్ధనన్న సిఆర్ రెడ్డి సర్కిల్, స్నాతకోత్సవ మందిరం, ఏయూ పరిపాలన భవనం వద్ద ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటిస్తారు. అనంతరం శతాబ్ది ఉత్సవాలను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన బెలూన్ ను నగర పోలీస్ కమిషనర్ ఎగురవేస్తారు. 

మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రధాన వేడుకలు బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా 30 నిమిషాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగా ఆవిష్కరణ, ప్రత్యేక నృత్య రూపకం ప్రదర్శన జరుగుతాయి.

అనంతరం ఏయు పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్, ఉపకులపతి, అతిధుల ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 6:30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శతాబ్ది సంవత్సర ఆరంభం నేపథ్యంలో వర్సిటీ పరిపాలన భవనం, ప్రవేశ మార్గాలు, పలు భవనాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.

కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, ఏయూ క్యాంపస్ కళాశాల  ప్రిన్సిపాల్స్ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఉపకులపతి స్వయంగా అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న