బహుళ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పోటీకి యువత సిద్ధం కావాలి
బహుళ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పోటీకి అనుగుణంగా యువత బహుళ నైపుణ్యాలతో రాణించాల్సిన అవసరం ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఏయు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లోని సాగరిక కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఫెస్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ సిబ్ విద్యార్థులు తమ జ్ఞానాన్ని విశ్వవిద్యాలయానికి వినియోగించాలని సూచించారు. ఏయూలో విభిన్న అంశాలపై ప్రాజెక్ట్ వర్క్ చేయాలని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం ఒక్కటే సరిపోదన్నారు. నేడు ప్రతి శాస్త్రంతో సాంకేతికత, ఏఐ,ఎంఎల్ వంటివి అనుసంధానం అవుతున్నాయని, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ లో కూడా వీటి ప్రాముఖ్యత ఉందన్నారు. బిజినెస్ ఇంజనీరింగ్ వంటి అంశాలు గణితంతో అనుసంధానమై ఉంటాయని, విద్యార్థులు ఆధునిక పోకడలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఏయు సిబ్ లో విభిన్న దేశాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారని, తద్వారా భారతీయ విద్యార్థులకు విభిన్న సంస్కృతులను పరిచయం చేసుకోవడం, తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక శాతం మంది విదేశీ విద్యార్థులను కలిగిన విశ్వవిద్యాలయంగా ఏయు నిలుస్తోందని చెప్పారు. విద్యార్థులకు విదేశాల్లో సైతం ఇంటర్న్ షిప్ అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
కేంద్రం సంచాలకులు ఆచార్య పి. విశ్వనాధం మాట్లాడుతూ 26 దేశాలకు చెందిన విద్యార్థులు తమ వద్ద విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. కళాశాల అభివృద్ధికి విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, ఏయు సిబ్ ఆచార్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి