సుస్థిర పరిష్కారాలను నిపుణులు సూచించాలి

 జియో సింథటిక్స్ తో బహుళ ప్రయోజనాలు 

– నిర్మాణరంగంలో విరివిగా వినియోగం 
–వి.ఎం.ఆర్.డి.ఏ చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్

జియో సింథటిక్స్ బహుళ ప్రయోజనకరంగా నిలుస్తున్నాయని వీఎంఆర్డిఏ చీఫ్ ఇంజనీర్ ఎం.వినయ్ కుమార్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ విశాఖ ప్రాంతీయ కేంద్రం, మెకఫెరి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒకరోజు సదస్సును బుధవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఏ.యూ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నర్చరింగ్ ద నేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ సస్టైనబుల్ జియోసింథటిక్ సొల్యూషన్స్ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విఎమ్ఆర్డిఏ చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ మానవ మేధస్సు నుంచి జియో సింథటిక్స్ ఉద్భవించిందని అన్నారు. గత మూడు శతాబ్దాలుగా దీని ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోందని అన్నారు. విశాఖలో నిర్మించిన తొలి ఫ్లైఓవర్ నిర్మాణంలో కూడా జియో సింథటిక్స్ వినియోగించామని చెప్పారు. యువ ఇంజనీర్లు ఈ రంగాన్ని తమ కెరియర్ గా మలచుకోవడానికి సదస్సు ఎంతో ఉపయోగంగా నిలుస్తుందని చెప్పారు. నిపుణులు సుస్థిర పరిష్కారాలను అందించాలని సూచించారు. నూతన అంశాలను నేర్చుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఇటువంటి సదస్సులు ఉపయుక్తంగా నిలుస్తాయని చెప్పారు. పర్యావరణ సమతుల్యతను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు.

మెకఫెరి సంస్థ బిజినెస్ హెడ్ గిన్లుకా స్పాడారో మాట్లాడుతూ పర్యావరణం అనేక నూతన సవాళ్లను విసురుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నిర్మాణ రంగానికి సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో నీటి వనరుల నిర్వహణ కీలకంగా మారుతుందని చెప్పారు. జియో సింథటిక్స్ ఉపయోగించి సుస్థిరమైన పరిష్కారాలను అందించడం సాధ్యపడుతుందని అన్నారు. నిర్మాణ ఖర్చును సైతం తగ్గించడానికి జియో సింథటిక్స్ ఎంతో ఉపయోగంగా ఉంటాయని చెప్పారు. 

ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ విశాఖపట్నం కేంద్రం చైర్మన్, ఏయూ సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ రంగంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణంలో జియో సింథటిక్స్ వినియోగం గణనీయంగా పెరిగిందని చెప్పారు. సాధారణ విధానాలకు భిన్నంగా జియో సింథటిక్ ఉపయోగిస్తూ పటిష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘకాలం మన్నే నిర్మాణాలు చేయడం సాధ్యపడుతుందని తెలిపారు. జియో సింథటిక్ పై సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో  కోర్స్ సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖ విమానాశ్రయం రన్ వే పటిష్టతకు, ఇతర ప్రాంతాలలో బహుళ నిర్మాణాలు చేపట్టడానికి జియో సింథటిక్ మెటీరియల్స్ ను వినియోగించామని చెప్పారు. కార్యక్రమంలో మెకఫెరి  టెక్నికల్ హెడ్ రత్నాకర్ మహాజన్,  జియో సింథటిక్స్ బిజినెస్ విభాగం హెడ్ సౌర్య దాస్,  ప్రొఫెసర్ రాజగోపాల్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి తదితరులు సాంకేతిక ప్రసంగాలను అందించారు.

సదస్సులో పరిశ్రమల నిపుణులు, సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు వివిధ కళాశాల ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 
అనంతరం పోర్టుల నిర్మాణం, నేల కోత నివారణ, జాతీయ రహదారులపై డ్రైనేజీల నిర్మాణం, జియో సింథటిక్స్ ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనం, వివిధ ప్రాంతాలలో జియో సింథటిక్స్ వినియోగించి చేసిన నిర్మాణాలు–వాటి ప్రాముఖ్యతలు, రైల్వే లైన్ ఎయిర్ పోర్ట్  రన్ వే ల నిర్మాణంలో జియో సింథటిక్ వినియోగం ఉపయోగాలు తదితర అంశాలపై నిపుణులు ప్రసంగించారు. 

విద్యాసంస్థలు, పరిశ్రమలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై మెకఫెరి  సంస్థ ప్రతినిధులు, ఏ.యూ సివిల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు, నిపుణులు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న