కోలాటం... గ్రామాలలో కొత్త ప్రభంజనం...

 కోలాటం.... కోలాహలం....

విశాఖపట్నం > డా.వేదుల నరసింహం

.


భారతీయ గ్రామాలు విభిన్న సంస్కృతులకు నిలయాలు. భారతదేశం ఎంతో వైవిధ్యత కలిగిన ప్రదేశం. ప్రపంచంలో ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచిన భారత్ లో మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో దేశంలో 14 అధికార భాషలు ఉండగా వాడుకలో 1650 పైగా భాషలు ఉన్నాయంటే భారతీయ వైవిధ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే స్థాయిలో ప్రతి రాష్ట్రంలో విభిన్నమైన సంస్కృతులు సాంప్రదాయాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవనం, సంస్కృతి- కళలతో ముడిపడి సాగుతుంది. అనేక కళలు కాలంతో పాటు మార్పుకు లోనవుతున్నాయి.


 భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టుగా, ఓల్డ్  ఈజ్ గోల్డ్ అన్న చందంగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. గతంలో మనం చూసిన, అంతరించిపోతాయేమో అనుకున్న అనేక కళలు నేడు పునరుజ్జివనం సాగిస్తున్నాయి. దశాబ్దాలుగా మరుగునపడిన మన సంస్కృతిని వెలికి తీసి పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించే దిశగా కొంతమంది నిరంతరం పరితపిస్తూ, పనిచేస్తున్నారు. 



గతంలో గ్రామాలలో, పట్టణాలలో సైతం ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలలో ఎటువంటి కార్యక్రమం జరిగిన కోలాటం జరపడం ఆనవాయితీగా వచ్చేది. ఇది ఒక దశాబ్ద కాలంగా తగ్గిపోతూ వచ్చింది. ఇటీవల కాలంలో దీనికి అదే స్థాయిలో ప్రాముఖ్యత, ప్రాధాన్యత పొందడం మనం గమనించవచ్చు. నేడు అనేక గ్రామాలలో, పట్టణంలోని అనేక ప్రాంతాలలో మహిళలు ఉత్సాహంగా కోలాటం నేర్చుకోవడం, సందర్భం వచ్చిన ప్రతిసారి కోలాటం ప్రదర్శనలు ఇవ్వడం పరిపాటిగా మారింది. 


ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న రవీంద్ర భారతిలో కోలాటం కళాకారుల ప్రదర్శన

Photo source :వికీపీడియా


 కోలాటం కళను సంరక్షిస్తూ భవిష్యత్ తరానికి అందించే బాధ్యతను మహిళలే భుజాన వేసుకున్నారు. వీరు ఎంతో శ్రద్ధగా వీటిని నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరు ప్రదర్శించే కోలాటం వెనుక కొన్ని వందల గంటల  కఠోర శ్రమ దాగి ఉంది. మహిళలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ బాధ్యతలను, తమ వృత్తిపరమైన, వ్యవసాయ (కూలి) పనులను నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల తర్వాత వీరు గ్రామాలలో కోలాటం సాధన ప్రారంభిస్తున్నారు. నిత్యం రెండు నుంచి మూడు గంటల పాటు పాటలకు అనుగుణంగా కాళ్లు చేతులు కదుపుతూ సాధన చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షకులు కూడా ఉన్నారు. వీరికి ప్రతినెల కొంత మొత్తం వేతనం గా ఇచ్చి వారిని గురువుగా పిలిచి గౌరవించి కోలాటవిద్యను అభ్యసిస్తున్నారు. 


కోలాటం ఆడుతున్న పిల్లలు.

Photo source :వికీపీడియా

వేడుక ఏదైనా కోలాటం ఉండాల్సిందే అనే విధంగా మహిళలు తమ కోలాటంతో అందరి మనసులను హత్తుకుంటున్నారు. సంక్రాంతి సమయం నుంచి గ్రామాలలో జరిగే తీర్థాలు, పరసలు, ఆలయ వార్షికోత్సవాలు, అమ్మవారి పండుగలలో దీనికి నిర్వాహకులు అగ్రతాంబూలం ఇస్తున్నారు. వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించి గ్రామాలలో పురవీధులలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది వరకు మహిళలు కోలాటం ప్రదర్శన ఇస్తున్నారు. మహిళలంతా ఒకే రంగులో ఉండే వస్త్రాలను ధరించి సంగీతానికి అనుగుణంగా నాట్యం చేస్తూ చేసే కోలాటం ప్రదర్శన గ్రామాలలో ఒక కొత్త సంచలనంగా మారింది. గతంలో డాన్స్ బేబీ డాన్స్ లకు ఈలలు విజిల్స్ వేసిన ప్రజలంతా నేడు కోలాటానికి జై కొడుతున్నారు మన సంస్కృతికి సాంప్రదాయానికి నమస్సులు చెల్లిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న