సమాజంలో మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించాలి
సమాజంలో మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించాలి
- మహిళ ఆశ్రయ కేంద్రం ఏర్పాటు అభినందనీయం
- చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- స్త్రీ అధికార్ కేంద్రం ప్రారంభం
- కేంద్ర మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి
విశాఖపట్నం > డా.వేదుల నరసింహం
విశాఖపట్నం ఏప్రిల్ 4:
మానవజాతిని నిర్మించి, నడిపించే మహిళలకు సంపూర్ణ భద్రత, భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని కేంద్ర మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. సిరిపురం వద్ద ఒక హోటల్లో నిర్వహించిన స్త్రీ అధికార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గృహహింస బాధిత మహిళలకు బాసటగా నిలిచే స్త్రీ అధికార్ కేంద్రాని కేంద్ర మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి సభ్యురాలు విజయభారతి మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించే విధంగా ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు కావడం అభినందనీయమని చెప్పారు. భారతదేశంలో మహిళలకు ఎంతో గౌరవం ప్రముఖ స్థానం కల్పించే సంస్కృతి ఉందని, నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండడం విచారకరమని అన్నారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, మహిళలపై దాడులు పెరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. నిత్యం తమకు 500కు పైగా ఫిర్యాదులు వస్తాయని, వీటిలో 100 వరకు మహిళలకు సంబంధించినవే ఉంటాయని చెప్పారు. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది మానవ అక్రమ రవాణాకు బాధితులుగా మారడం విచారకరమని చెప్పారు. తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండడం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్తర భారతంలో తాను చూసిన అనేక కేసులు తన మనసును కలచివేస్తున్నాయని వివరించారు. ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. మహిళలకు అవసరమైన హక్కులను, భద్రతను రాజ్యాంగం కల్పించిందని వివరించారు. చట్టాలను వాటినీ నిర్వహించే వ్యవస్థలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ విభిన్న సంఘటనలు నేపథ్యంలో, బాధితులుగా మారిన మహిళలు తమ వద్దకు వస్తుంటారని వారి సమస్యలు ఎంతో సున్నితమైనవని పలు ఉదాహరణలతో వివరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారికి కుటుంబం నుంచి కూడా సహకారం కరువుతోందని చెప్పారు. కేవలం భర్త నుంచే కాకుండా తమ పిల్లలనుంచి కూడా మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్న సంఘటనలు తన వద్దకు వచ్చాయని చెప్పారు. ఇటువంటి వారికి ఆశ్రయం కల్పించే విధంగా స్త్రీ అధికార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనను, నిర్వాహకులను అభినందించారు.
బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ ఇండియా పార్టనర్ పి.సి.దొరస్వామి మాట్లాడుతూ గృహహింస బాధితులైన మహిళలకు తమ సంస్థలో ఉపాధి కల్పించడానికి తాము సిద్ధంగా ఉంటామని వారికి ఆర్థిక భరోసాను కల్పించే విధంగా తమ సంపూర్ణ సహకారం ఇస్తామని ప్రకటించారు. నగరాలలో ఇటువంటి కేంద్రాలు రావడం ఎంతో మంచిదని చెప్పారు.
స్త్రీ అధికార్ కేంద్రం నిర్వాహకురాలు, సామాజిక కార్యకర్త అనిత సకురు మాట్లాడుతూ త్వరలో ఈ కేంద్రాన్ని పరవాడ వద్ద ఏర్పాటు చేస్తున్నామని, గృహహింస బారిన పడిన ప్రతి మహిళకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కేంద్రాలు 7 నుంచి 8 వరకు నెలకొల్పడం తమ తదుపరి లక్ష్మమని వివరించారు. గృహహింసకు లోనైన వారిని చేరతీయడం, అదే విధంగా ఆ కుటుంబాలను చక్కదిద్దడం కూడా తమ లక్ష్యమని వివరించారు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని కోరారు.
హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రధానమని చెప్పారు. భారతీయ మూలాలు విలువైనవని, పురాణాలలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన విధానాన్ని విపుళీకరించారు.
.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి