ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు
26 నుంచిఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు
- ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్ లో వాకథాన్
- మధ్యాహ్నం 3:30 నుంచి ప్రధాన వేడుక ప్రారంభం
- ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక
- వివరాలు వెల్లడించిన ఏయువిసి ఆచార్య రాజశేఖర్
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 26న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు ఏ.యూ పరిపాలన భవనం వద్ద శతాబ్ద ఉత్సవాలకు సంబంధించిన బెలూన్ లాంచింగ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 3:30 గంటల నుంచి ప్రధాన వేడుకను జరుపుతామని తెలిపారు. మధ్యాహ్నం జరిగే శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి, ఐఐటి పాలకడ్ డైరెక్టర్ ఆచార్య ఏ.శేషాద్రి శేఖర్ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు.
శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. అనంతరం అతిధుల ప్రసంగాలు ఉంటాయి. తరువాత విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, ఏడాది కాలంలో నిర్వహించే కార్యక్రమాలతో కూడిన కార్యక్రమాల సమాహారంగా నిలిచే వార్షిక క్యాలెండర్, శతాబ్ది ఉత్సవాల లోగా ఆవిష్కరణ జరుపుతారు.
శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడు రంగాలలో పని చేసే దిశగా ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పారు. అకడమిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులను పెంపొందించడం, ఔట్రీచ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ వంటివి, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సిఎస్ఆర్ నిధులతో విభిన్న అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఒక ప్రత్యేకమైన ఐకానిక్ టవర్ ను నిర్మించాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థుల సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నట్లు చెప్పారు. అవుట్ రీచ్ విభాగంలో భాగంగా గ్రామీణ విద్యార్థులకు చేరువయ్యే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని అనుబంధ కళాశాలల సహకారంతో నిర్వహించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో శతాబ్ది సంవత్సరంలో నిర్వహించే విభిన్న కార్యక్రమాలతో కూడిన సవివర నివేదికను, ప్రణాళికను అందరికీ అందిస్తామని తెలిపారు. క్లస్టర్ వారీగా మెగా ఈవెంట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.


జయహో ఆంధ్ర విశ్వకళాపరిషత్! జయహో!!
రిప్లయితొలగించండి