దేశ, ప్రపంచ ప్రగతికి ఏయు దోహదపడింది

 ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి 

–యువ మస్తిష్కాలను మలిచింది 
–దేశ, ప్రపంచ ప్రగతికి ఏయు దోహదపడింది

విశాఖపట్నం ఏప్రిల్ 26: 

ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ అభ్యున్నతికి అందరూ సమిష్టిగా కృషి చేస్తూ దీనిని ముందుకు తీసుకువెళ్లాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. మధు మూర్తి అన్నారు. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల ప్రారంభ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్ లోని ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను స్పృశించింది అని అన్నారు. అదేవిధంగా యువ మస్తిష్కాలను మలచిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. దేశానికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందని అన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయం సొంతమన్నారు. జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఈ ప్రయాణం నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైన్స్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాంకేతికల  వృద్ధికి పెట్టుబడిని పెడుతోందని అన్నారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందని వివరించారు. త్వరలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతుందని, దీని ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశానికి యువ జనాభా ఎంతో లాభదాయకంగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో బోధన విధానాన్ని ఏఐ సాంకేతికత సవాలు చేసే దిశగా మారుతుందని చెప్పారు. విద్య, పరిశోధన, ప్రజాసేవ రంగాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తిపై ఉందని స్పష్టం చేశారు. 

విశిష్ట అతిథి ఐఐటి పాలకడ్ డైరెక్టర్ ఏ.శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ సమగ్ర విద్యను అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై బలమైన పట్టు సాధించడం ఎంతో అవసరమని, అదే విధంగా సాఫ్ట్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న మార్పులపై యువత దృష్టి సారించాలని, సుస్థిర ప్రగతి కీలకంగా మారుతుందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా తాను నిలవడానికి గల కారణం, సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనకు పాఠాలు బోధించి తన ఉన్నతికి పాటుపడిన అధ్యాపకులను గుర్తు చేసుకుంటూ నేడు తాను ఇంతటి ఉన్నత స్థానంలో నిలవడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయమే కారణమని అన్నారు. ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంటును చదవాలని సూచించారు. పూర్వ విద్యార్థిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు.

 ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ దార్శినికుల వారసత్వం, నాయకత్వం ఏయూను నడిపించిందని చెప్పారు. అకడమిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఔట్రీచ్ రంగాలలో ఏయూ మరింత పటిష్టంగా పనిచేస్తుందని చెప్పారు. ట్రైనింగ్ ప్లేస్మెంట్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. సహ పాఠ్య కార్యక్రమాల ప్రాధాన్యత గుర్తించి విద్యలో భాగం చేస్తామని తెలిపారు. నిబద్ధతతో పనిచేస్తామని ఏడాది పొడుగునా నిర్వహించే శతాబ్ది వేడుకలలో నోబెల్ గ్రహీతలను ఆహ్వానిస్తామని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పై స్వయంగా తెలుగులో కవితను రాసి చదివి వినిపించారు. 

విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటూ వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఒక భావోద్వేగా అనుబంధం ఎందరికో ఉందన్నారు. అందరి సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని చెప్పారు. సాంకేతికత అనేక నూతన  సవాళ్లను విసురుతోందని, విద్యావ్యవస్థలో దీనికి అనుగుణంగా అవసరమైన మార్పులను తీసుకురావాలని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత లో ఎంతో అభ్యున్నతి సాధించాలని, భవిష్యత్తును ఇది శాసిస్తుందని చెప్పారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నిలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరుగాంచిందని చెప్పారు. 

పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి రావు మాట్లాడుతూ ప్రజల జీవితాన్ని మార్చిన వ్యవస్థగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చెప్పవచ్చునన్నారు.  పూర్వ విద్యార్థుల సంఘం తరఫున వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం, తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు తదితరులు ప్రసంగించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సి.హెచ్ శాంతమ్మ, ఆచార్య బి.ప్రసాద్ రావు లను ఈ సందర్భంగా వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం ఆచార్య ప్రసాదరావు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థుల మనసులను హత్తుకుంది. తాము చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ రుణం తీర్చుకోవాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో తాను స్థాపించిన పాఠశాల అభివృద్ధిని వివరించారు. 

కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విజన్ డాక్యుమెంట్, లోగోలను అతిధులు ఆవిష్కరించారు.

కార్యక్రమం ఆరంభంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వేదికపై భారతీయ సంస్కృతులతో, పాటు విదేశీ సంస్కృతులను సాంస్కృతిక వైవిధ్యతను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ ఉపకులపతులు, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాల్, ఆచార్యులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అతిధులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న